info@manadailynews.com
Breaking News

నరెగా పనులు ప్రజల్లో సంతృప్తినివ్వాలి

MNREGA
  • పశు గణాభివృద్దీ, పాడిపరిశ్రమపై పోర్టల్
  • పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి : చంద్రబాబు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా పథకం (నరెగా) పనులను అన్ని ప్రభుత్వ శాఖలు ఉమ్మడి వ్యూహంతో పూర్తి చేసి ప్రజల్లో సంతృప్తి కలిగేలా ప్రణాళికలు అమలు చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. నరెగా పనుల ప్రగతిని ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. 11 ప్రభుత్వ శాఖల్లో గత వారంలో 134 కోట్ల రూపాయలు ఖర్చు తో వివిధ నరెగా పనులు పూర్తి అయ్యాయని సంబంధిత అధికారులు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల పనులు మందకొడిగా సాగినా వాటిని రాబోయే రోజుల్లో వేగవంతం చేసి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
పనులు లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి కానీ చోట వినూత్నంగా ఆలోచనలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, పాఠశాల విద్యా శాఖలో పనులు ఇంకా వేగవంతం చేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు. అవసరాలకు అనుగుణంగా పశుసంవర్ధక శాఖ తన ఉత్పత్తులను సిద్ధం చేయాలని చెప్పారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలన్నారు. పశు సంవర్ధక ఉత్పత్తులు, లబ్ధిదారులు, రైతులు, అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ఒక వెబ్ పోర్టల్ ని రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 91 లక్షల పశు సంతతి, 14 లక్షల రైతులు కు సంబంధించిన పూర్తి వివరాలను జియోట్యాగ్ చేసి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. గృహనిర్మాణం లో 31.35 శాతం నరెగా పనులు లక్ష్యం సాధించి మెరుగైన పనితీరు కనబర్చిందని.. ఇంకా పనులు వేగవంతం చేయాలనీ అన్నారు.
పంచాయితీ రాజ్ లో గడచినా నెలలోనే నరెగా కింద 122 కిలోమీటర్ల రోడ్ల వేశారని, మొత్తం 7000 కిలోమీటర్లకు గాను ఇప్పటి వరకు 2,198 కిలోమీటర్ల రోడ్లు వేసినట్టు అధికారులు వివరించారు. నరెగా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 14.98 కోట్ల పనిదినాలు కల్పించామన్నారు. పనులన్నిటి చెల్లింపులు సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు, పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.