info@manadailynews.com
Breaking News

Mana Anantha Sundara Anantha – Wall Paintings

mana anantha copy

“మన అనంత – సుందర అనంత”
అనంతలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టాలు
– జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవిరళ కృషి ఫలితమే అపురూప చిత్రాల దృశ్యమాలిక ఆవిష్కృతం
– నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా చరిత్రను సాక్షాత్కరించేలా, ఆకట్టుకునేలా బొమ్మల పెయింటింగ్
– ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్న అపురూప చిత్రాలు
– నగరంలో పూర్తయిన ఒక లక్ష 50 వేల స్క్వయర్ ఫీట్ల మేర బొమ్మల చిత్రీకరణ
“మన అనంత – సుందర అనంత” కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా చరిత్రను సాక్షాత్కరించేలా, ఆకట్టుకునేలా వేసిన బొమ్మల పెయింటింగ్ దృశ్యాలు అపురూపంగా మారి జనం మదిమెచ్చిన సిత్రాలుగా నిలుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవిరళ కృషి ఫలితంగా అపురూప చిత్రాల దృశ్యమాలిక ఆవిష్కృతం.

17 18 19 20 16 11 12 13 14 15 1 2 3 4 5 6 7 8 9 10

ఈ ఏడాది జనవరి 26వ తేదీన అనంతపురం నగరంలో ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా ఆకట్టుకునేలా, చరిత్ర తెలిసేలా బొమ్మలు వేసే కార్యక్రమంను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రారంభించడం జరిగింది. జనవరిలో మొదలైన కార్యక్రమం డిసెంబర్ నెల వరకు పనులు జరగ్గా.. ఇప్పటివరకూ నగర వ్యాప్తంగా ఒక లక్ష 50 వేల చదరపు అడుగుల మేర బొమ్మలు వేశారు. ఇందుకు గాను దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేశారు. అనంతపురం మున్సిపాలిటీ నిధులు కొంత అహుడా నిధులు కొంత ఉపయోగించి ఆకట్టుకునే చిత్రాలను వేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.

ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్న అపురూప చిత్రాలు :
అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గోడలపై కంబళి తయారు చేసే విధానం, పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా ఆకట్టుకునే బొమ్మలు, రచ్చబండ కబుర్లు తదితర చిత్రాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చిత్రాలు ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి కి ఎదురుగా ఉన్న గోడలపై పిల్లల ఆటలు, చిన్ననాటి క్రీడలు, కోతికొమ్మచ్చి ఆట, ఉప్పాట, కొబ్బరి మట్టలు లాగుట తదితర గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగవుతున్న క్రీడలను గోడలపై బొమ్మలు గా చిత్రీకరించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అలాగే రుద్రం పేట బైపాస్ ఫ్లైఓవర్ కింద అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను అని వేసిన భారీ బొమ్మలు, ఎంతో సహజంగా అశోకుడు చెట్లు నాటిస్తున్న బొమ్మ, నాటిన చెట్లను చూపరులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. అంతే కాకుండా దానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాణం ఘట్టాలు, 1941లో పార్లమెంట్లో నెహ్రూ, డా.అంబేద్కర్ లు మాట్లాడుతున్న దృశ్యాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, డా. అంబేద్కర్ తదితరులు రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కు రాజ్యాంగం అందిస్తున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

31 32 33 34 30 29 28 27 26 21 22 23 24 25

కదిరి రోడ్డులోని సత్యసాయి కళాశాల గోడలకు వేసిన వజ్రకరూరు వజ్రాల వేట దృశ్యాలు, వేరుశనగ కాయలు, గ్రామీణ క్రీడలు, గోలీలాట, తొక్కుడు బిళ్ళ ఆట, గ్రామీణ క్రికెట్, కోడిపందాలు, వ్యవసాయ పంట, వరి నాట్లు నాటడం, బొప్పాయి తోట, బత్తాయి తోట, ద్రాక్ష తోట, మొక్కజొన్న తోట, దానిమ్మ తోట, టైరు ఆట, ఉపాధి హామీ పథకం పనులు, మన ప్రత్యేక వంటలు, జొన్న రొట్టెలు, మిరపకాయ బజ్జీలు, ఓలిగలు, వగ్గాని బజ్జి, రాగి సంకటి నాటుకోడి పులుసు, ధర్మవరం పట్టుచీరలు నేయుట, కూరగాయల సంత తదితర అన్ని రకాల బొమ్మలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న జెఎన్టియు గోడలపై గొరువయ్య, సోది చెప్పుట బొమ్మలు కూడా కనువిందు చేస్తున్నాయి. అంతేకాకుండా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల గోడలు, సత్యసాయి కళాశాల రోడ్, కోర్ట్ రోడ్ లో న్యాయ వ్యవస్థకు సంబంధించిన చిత్రాలు, టవర్ క్లాక్ వద్ద నున్న ఫ్లైఓవర్, డా. బి.ఆర్ అంబేద్కర్ (రాంనగర్ ) ఫ్లైఓవర్, ప్రధాన కూడళ్లలో రోడ్లకు ఇరువైపులా ఉన్న డివైడర్స్ పై ఆకట్టుకునే విధంగా పలు చిత్రాలను పెయింటింగ్ వేయించడంతో చూపరులను వాటివైపు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా కేంద్రం లో గోడలు, రహదారుల్లో పెయింటింగ్ తో పలు అందమైన చరిత్ర తెలిసేలా చిత్రాలు రూపొందించడంతో అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

నగరంలో గోడలపై అపెక్స్ క్వాలిటీతో వెదర్ ఫ్రూప్ కలర్ ని ఉపయోగించి ఆకట్టుకునేలా బొమ్మలు ఎక్కువ కాలం చెదిరిపోకుండా ఉండేలా వేసినట్లు శ్రీ విజయ అసోసియేట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహమ్మద్ అలీ తెలిపారు. ఒక టీం కి 8 మంది చొప్పున 6 టీం లతో పెయింటింగ్ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, డివైడర్ లకు ఇరువైపులా ఆకట్టుకునేలా, చరిత్ర తెలిసేలా బొమ్మలు వేసే కార్యక్రమంను చేపట్టామని, నగర వ్యాప్తంగా ఒక లక్ష 50 వేల చదరపు అడుగుల మేర బొమ్మలు వేశామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.