info@manadailynews.com
Breaking News

రెండు కోట్ల ఎకరాలకు నీరందించాలన్నదే లక్ష్యం

DAS_4651
  • ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి ఆదేశం 
  • పోలవరం పునరావాస చర్యలు డిసెంబర్ కి పూర్తి కావలి : సీఎం

ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలను రూపొందించుకోవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. మొత్తం రెండు కోట్ల ఎకరాల కు నీరందించాలి.. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్థ నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ పని ప్రగతిని ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

పోలవరం ప్రాజెక్టు వీడియో కాన్ఫరెన్స్

పోలవరం ప్రాజెక్టు వీడియో కాన్ఫరెన్స్

వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో అధిక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీ నీరు అందుబాటులో ఉంది. మిగిలిన చెరువులు భూగర్భ జలాలు ఇతర వనరులు చుస్తే మొత్తం 867 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు.
రెండు కోట్ల ఎకరాలకు నీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు ఇవ్వడానికి ఎలా నీరువినియోగించాలి అన్న దానిపై ఇంకా లోతుగా పరిశీలన చేయాలి.. ఉన్న ప్రాజెక్టులన్నింటినీ అనుకున్నట్టుగా పూర్తి చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలం అని ఆయన అన్నారు. మొత్తం వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యం తో పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
37,546 చిన్నతరహా సాగునీటి చెరువులు ఉన్నాయి, 10 లక్షల పంట కుంటలు నిర్మిస్తున్నాం, చెక్ డ్యామ్ లను నిర్మించి అన్ని చెరువుల్లో నీటిని నిల్వ చేయాలి , ఇలా వీటన్నిటిలో నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకోగలిగితే వర్షాధార ప్రాంతాల్లో నీటిని అందుబాటులోకి తేవడం కష్టసాధ్యం కాదని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వివిధ ప్రోజెక్టుల కింద ఉన్న కట్టడాలు, నిర్మాణాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
పోలవరానికి లక్ష మంది సందర్శకులు:
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని, వర్షాల తాకిడి ఉన్నప్పటికీ పనులు అనుకున్న మేర పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి. గేలరీ వాక్ కి స్పిల్ వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయని చెప్పారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు.
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ కు లక్ష మంది సందర్శించారు. అయితే అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్ట్ సందర్శనకు ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేసి అవహగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్ కి పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తవ్వాలన్నారు. వచ్చే వారం సమావేశానికి పూర్తి కార్యాచరణతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనులకు చెల్లించే బిల్లుల పై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజినీర్ల బోర్డు సమావేశం అవుతోందని, ఆ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. సమీక్ష మామావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు.

వంశధార ఇంజినీర్లకు ముఖ్యమంత్రి ప్రశంసలు
వంశధార రెండో దశ పనులు త్వరిత గతిన పూర్తి చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ఇంజినీర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. వంశధార రెండో దశ కింద 4000 క్యూసెక్కు ల నీటిని హీరమండలం రిజర్వాయర్ కి పంపేలా పనులు పూర్తి చేసినట్టు ఆ ప్రాజెక్ట్ ఎస్ఈ వివరించారు. అనుకున్న ప్రకారం రేయింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇది గొప్ప విజయమని, మిగిలిన ప్రోజెక్టుల పనులు కూడా ఇదే స్ఫూర్తితో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి మంచి పని తీరు ప్రదర్శించిన ఇంజినీర్లకు కూడా ప్రోత్సాహక అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.