info@manadailynews.com
Breaking News

కేసీఆర్‌పై క‌త్తులు దూస్తున్న కాంగ్రెస్‌!

kcr-digvijay-singh

కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ క‌త్తులు దూస్తోంది. ఇందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆయుధాలుగా చేసుకుంటోంది. తెలంగాణ‌కు కేంద్రం ఇస్తున్న వేల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేసీఆర్ ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని అమిత్ షా వ‌రంగ‌ల్ స‌భ‌లో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్ర‌భుత్వం వారానికో కొత్త ప‌థ‌కం తెస్తూ భారీగా నిధుల‌ను రాష్ట్రానికి ఇస్తుంటే ఇక్క‌డున్న కేసీఆర్ ఆ నిధుల‌ను ఎమ్మెల్యేను కొన‌డానికి ఉప‌యోగిస్తున్నార‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. షా చేసిన విమ‌ర్శ‌ల‌ను అధికార పార్టీ నేత‌ల్లో పేరున్న‌వారెవ‌రూ ఖండించ‌లేదు. దాంతో ఇప్పుడు రెచ్చిపోవ‌డం కాంగ్రెస్ వంతైంది. అమిత్ చెప్పిన‌ట్లు 90 వేల కోట్ల రూపాయ‌ల నిధులు వ‌స్తే వాటిని ఏ అభివృద్ధి ప‌నుల‌కు ఖ‌ర్చు పెట్టారో చెప్పాల‌ని కాంగ్రెస్ నేత‌లు నిల‌దీస్తున్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన దిగ్విజ‌య్ సింగ్‌, మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వంటి నేత‌లు నేరుగా ఇదే అంశాల‌ను ప‌ట్టుకుని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌నిలోప‌నిగా రైతు వ్య‌తిరేకిగా తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని దిగ్విజ‌య్ మండిప‌డ్డారు. తుపాకులు చూపించి బెదిరించి భూములు లాక్కుంటున్నారంటూ ఆరోపించారు. ఇక‌, ఇప్పిట‌కే షా చేసిన వ్యాఖ్య‌లు జ‌నంలోకి వెళ్ల‌డం…. వాటిని ఎలా తిప్పి కొట్టాలో తెలియ‌క టీఆర్ఎస్ నేత‌లు స‌త‌మ‌త‌మవుతున్నారు. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ నేత‌లు తోడు కావ‌డం గ‌మ‌నార్హం.