తెలంగాణలో బీజేపీ యుద్ధం ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. తెలంగాణ విమోచన దినం సదర్బంగా నిర్వహించిన వరంగల్ సభలో బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా సమరబేరీ మోగించారు. కేసీఆర్‌పై ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఆరోపణలు చేశారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ నేతలు ఫిరాయింపులకు దిగి కేసీఆర్ పక్షాన చేరడంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ తదితర పార్టీలు రాష్ట్రంలో కుదేలయ్యాయి. దాంతో వారు ప్రభుత్వంపై చేస్తున్న పోరు నామమాత్రంగా మారిపోయింది. ఈ దశలోనే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించి ఎమ్మెల్యేను కొంటూ కేసీఆర్ చట్టవ్యతిరేకంగా నడుస్తున్నారని అమిత్ షా నేరుగా ఆరోపించారు. ఒక జాతీయ పార్టీ చీఫ్, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలతో గులాబీ బాస్‌కు దిమ్మతిరిగపోయింది. కేంద్రం ప్రభుత్వం రైతులు, ప్రజల కోసం కొత్త పథకాలు తెస్తుంటే వాటి ద్వారా రాష్ట్రానికి నిధులిస్తుంటే అవి జనానికి చేరడం లేదని అమిత్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు ఊరకనే టీఆర్ఎస్లోకి రావడం లేదన్న అమిత్… కేంద్రం ఇస్తున్న నిధులను ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పంచుతున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు రూ.711 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇస్తే అవి అన్నదాతలకు చేరలేదని బీజేపీ చీఫ్ చెప్పారు. ఇవే కాక రూ.90 వేల కోట్లను తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిందని ఇవి కూడా ప్రజలకు చేరలేదని ఆరోపించారు. బీజేపీ చీఫ్ చేసిన ఆరోపణలను కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఆరోపణలు ఎదురవడంతో ఆయన పార్టీ నేతలు ఎలా వాటిని ఎదుర్కొంటారో మరి.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అమిత్ యుద్ధం!
