info@manadailynews.com
Breaking News

తెలంగాణలో 1000 ఏఈవో పోస్టులకు పచ్చజెండా

AEO posts

తెలంగాణలో 1000 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నా.. ఆర్థికశాఖ ఆమోదించినా.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నుంచి వచ్చిన కొన్ని అభ్యంతరాల కారణంగా నోటిఫికేషన్ నిలిచిపోయింది. మొత్తానికి టీఎస్‌పీఎస్సీ అభ్యంతరాలను వ్యవసాయశాఖ పరిష్కరించడంతో పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. వారం రోజుల్లోగా ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. వాస్తవంగా గతేడాది ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేశాక మొత్తం 4,442 సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) పోస్టులను భర్తీ చేయాలని సర్కారు భావించింది. అందులో 90% వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా పూర్తిచేసిన వారికి, 10% అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయించాలని అనుకున్నారు. అలాగే ఆ మొత్తం పోస్టుల్లో 20 శాతం ప్రత్యేకంగా ఉద్యానశాఖకు కేటాయించాలనుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఈ ఆలోచనను మార్చుకొని కేవలం ఏఈవోలనే నియమించాలని భావించింది.
వ్యవసాయ పోస్టుల భర్తీలో జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా)లో వ్యవసాయ కోర్సు చేసిన వారికి ఒక శాతం రిజర్వేషన్ ఉండేది. అయితే ఆ కోర్సు ప్రస్తుతం రద్దయినా రిజర్వేషన్ అలాగే కొనసాగుతోంది. దీనిపై టీఎస్‌పీఎస్సీ అభ్యంతరం లేవనెత్తింది. ఆ సమస్య పరిష్కారం కాకుండా ఈ పోస్టులు భర్తీ చేయలేమని స్పష్టంచేసింది. దీనిపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేసి సమస్యను పరిష్కరించారు. ఆ రిజర్వేషన్‌ను వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.