ఒకప్పుడు పిలిచినా వెళ్లని కేసీఆర్… ఇప్పుడు పిలకుండానే బీజేపీ నేత, కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటికి ఎందుకు వెళ్లారు. ఏపీకి వెంకయ్య నాయుడు మాదిరే తెలంగాణకు దత్తన్నే పెద్దన్న అంటూ పొగడ్తలు ఎందుకందుకున్నారు. ఒకవైపు బీజేపీ చీఫ్ అమిత్ నేరుగా కేసీఆర్పైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే కేసీఆర్ మాత్రం ఢిల్లీలో మకాం వేసి బీజేపీ నేతలను ఎందుకు దువ్వుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే కేంద్రంలోని బీజేపీతో తగవు పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ గ్రహించినట్టున్నారు. విమోచన దినం సందర్భంగా బీజేపీ వరంగల్లో నిర్వహించిన సభలో కేసీఆర్పై అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ప్రజల కోసం 90 వేల కోట్ల రూపాయలు ఇస్తే… వాటిని కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనేందుకు వాడుతున్నారని అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై టీఆర్ ఎస్ పెద్దగా స్పందించలేదు. కేసీఆర్ కానీ, సీఎం తరఫు వ్యక్తులు కానీ అమిత్ వ్యాఖ్యలను ఖండించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు దెబ్బతినిపోవడంతో తాము బలపడాలని భావిస్తున్న బీజేపీ నేతలు అమిత్ షా ఆరోపణలను తీసుకుని జనంలోకి వెళ్లారు. ప్రభుత్వానికి, కేసీఆర్కు ఎంత డామేజ్ చెయ్యాలో అంతా చేస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మౌనం పాటించడమే కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ వెళ్లి మంత్రులను కలుస్తున్నారు. అంటే బీజేపీతో శత్రుత్వం పెంచుకోవడం కంటే మిత్రత్వం కొనసాగించడమే మేలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని రాజకీయ వర్గాల కథనం. ఆ క్రమంలోనే గతంలో ఓసారి ఆంధ్రభవన్లో ఉన్న దత్తాత్రేయ ఆ పక్కనే వేరేచోట ఉన్న కేసీఆర్ను కలవాల్సిందిగా కొరితే పట్టించుకోని తెలంగాణ సీఎం… ఇప్పుడు నేరుగా దత్తాత్రేయ ఇంటికి వెళ్లారని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వెళ్లడమే కాదు… ఇకపై రాష్ట్రానికి ఏం కావాలన్నా దత్తాత్రేయనే కలవాలని ఆయన సలహాలు, సూచనల మేరకు నడుచుకోవాలని తన ఎంపీలకు సూచించారు. కేసీఆర్ కరచాలనాన్ని అందుకుని ఆయనతో స్నేహగీతాన్ని పాడడానికి బీజేపీ సిద్ధమవుతుందో లేదో మరి.
కమలం కత్తుల… కేసీఆర్ స్నేహగీతం!
