తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావుకు ఏపీ చెప్పిన దానికి సై అంటున్నారు. విభజన తర్వాత ఏపీకి ఏం ఇచ్చేది లేదు పొమ్మంటూ అడ్డం తిరిగిన కేసీఆర్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుందామంటూ ప్రతిపాదనలు తెస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల, ఉమ్మడి సంస్థల విషయంలో ఏపీని మూడు చెరువుల నీళ్లు తాగించాలనుకున్న తెలంగాణ సీఎం…. ఇప్పుడు సమస్యను పరిష్కరించాలంటూ కేంద్రాన్ని, హోం శాఖను కోరుతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ను కలిసిన కేసీఆర్ పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన విషయంపై శ్రద్ధ పెట్టి తక్షణం పరిష్కరించాలని కోరారు. మొన్నటి వరకూ సమస్యలు పరిష్కరించుకుందాం… ఉమ్మడి ఆస్తులను పంచుకుందాం అంటూ ఏపీ చేసిన ప్రతిపాదనపై కనీసంగా కూడా స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ జోక్యం కోరుతున్నారు. ఉన్నత విద్యామండలి ఖాతాల స్తంభన కేసులో హైకోర్టు, సుప్రీం కోర్టు ఏపీకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. ఆ తీర్పును అమలు చేయమని కోరినా తెలంగాణ సర్కారు ససేమిరా అంది. మళ్లీ సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది. అయితే, ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు కూడా సుప్రీం కోర్టు అంగీకరించలేదు. దాంతో ఇక ఎక్కడికీ వెళ్లే అవకాశం లేక కేసీఆర్ నేరుగా హోంశాఖ మంత్రి రాజ్నాథ్ దగ్గరకెళ్లారు. పదో ఫెడ్యూల్లోని సంస్థల పంపిణీపై దృష్టి పెట్టాలని కోరారు. ఉమ్మడి ఆస్తులను విభజన చట్టం ప్రకారం పంచుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం పంచుకుందామని ఏపీ ప్రభుత్వం పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ జోక్యం కోరడం గమనార్హం.
ఏపీ చెప్పినట్లే చేద్దామంటున్నకేసీఆర్
