ఏపీ సీఎం చంద్రబాబుకు మొన్నామధ్య తెలంగాణ ఏసీబీ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై మళ్లీ విచారణ చేయాలని ఆదేశించింది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీలోని ప్రకాశం జిల్లా కోర్టు ఏకంగా నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల(అక్టోబరు) 3న తమ ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశించింది. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఏసీబీ డీజీ ఖాన్లకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా ఏడవ అదనపు న్యాయమూర్తి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్రులను కించపరిచేలా కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు కేటీఆర్, కవిత, హరీశ్ రావులు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంలు దూషణలకు దిగారని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన వేజెండ్ల సుబ్బారావు అద్దంకి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసిందని సుబ్బారావు తెలిపారు.
కేసీఆర్కు ఏపీ కోర్టు నోటీసులు
