టెలికాం చరిత్రలో ఓ సంచలనం అంటూ దూసుకొచ్చిన రిలయన్స్ జియో సిమ్స్ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జియో సిమ్స్ కొన్న వారంతా కాల్స్ కలవక, సిమ్స్ యాక్టివేట్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. పోర్టబులిటీ పెట్టుకున్న వారు కూడా ఇదేం సర్వీస్ రా బాబు అంటూ మళ్లీ తమ పాత నెట్ వర్క్ లకే వెళ్తున్నారు. వినియోగ దారులు ఇంత ఇబ్బంది పడుతున్నా డియో మాత్రం టెలికం సంస్థలపై నిందలు వేస్తూ కాలం గడుపుతోంది.
ఇక ఈ విషయంలో ఎయిర్ టెల్ ను దోషిని చేసేందుకు ముఖేశ్ అంబానీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలనే ఎయిర్ టెల్ జియోను ఇబ్బంది పెడుతోంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక గత పది రోజుల వ్యవధిలో వొడాఫోన్ నెట్వర్క్ నుంచి 15 కోట్ల కాల్స్ ఫెయిల్ అయితే, జియో నుంచి వొడాఫోన్‌కు వెళ్లే వంద కాల్స్‌లో 80 ఫెయిల్ అవుతున్నాయని తేలిపోయింది. దీంతో రోజుకు ఐదు లక్షలమంది వినియోగదారులు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఎయిర్టెల్ తో పాటు అన్ని నెట్ వర్క్స్ తమ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయని ముఖేశ్ అంబానీ తప్పును వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు. ఇతర నెట్ వర్క్స్ కూడా ముఖేశ్ మాటలను తోసిపుచ్చుతున్నాయి. ఇప్పటికే 2100 పీఒఐలు ఇచ్చామని, మరో వెయ్యి పీఒఐలు ప్రాసెస్‌లో ఉన్నాయని ఎయిర్టెల్ ప్రకటించింది. మరి అసలు సమస్య ఏంటో గానీ జియో వినియోగ దారుల ఫిర్యాదులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి.